ధూమపానంతో మందగిస్తున్న జ్ఞాపక శక్తి.. బీ అలర్ట్..

ధూమపానంతో మందగిస్తున్న జ్ఞాపక శక్తి.. బీ అలర్ట్..

ధూమపానంతో మందగిస్తున్న జ్ఞాపక శక్తి.. బీ అలర్ట్..

ధూమపానంతో మందగిస్తున్న జ్ఞాపక శక్తి.. బీ అలర్ట్.. ధూమపానం ఆరోగ్యానికి హానికరం.. ఇది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పొగ రాయుళ్లకు ఈ వాక్యం సుపరిచితమే. ఎందుకంటే వారు తాగే సిగరెట్ డబ్బాలపై ఉండే వార్నంగ్ కొటేషన్ ఇది. అయినా వారు మాత్రం ఏమీ పట్టనట్టుగా గుప్పుగుప్పుమంటూ పొగ తాగేస్తుంటారు. ఈ అలవాటు అప్పటికప్పుడు మంచి కిక్ ఇచ్చినా.. దీర్ఘకాలంలో మాత్రం తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ధూమపానం చేసే మధ్య వయస్కుల్లో జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యతో బాధపడుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఓహియో స్టేట్ యూనివర్సిటీ చేపట్టిన అల్జీమర్స్ డిసీజ్ జర్నల్‌ లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనం కోసం డేటా 2019 నేషనల్ బిహేవియరల్ రిస్క్ ఫ్యాక్టర్ సర్వైలెన్స్ సిస్టమ్ నుంచి వచ్చింది. ధూమపానం చేసేవారిని, ఇటీవల ధూమపానం మానేసిన వ్యక్తులు, చాలా ఏళ్ల క్రితం మానేసిన వారిని గ్రూపులుగా విభజించి, పరిశోధనలు చేయడం ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నారు. 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న 1,36,018 మందిపై అధ్యయనం చేయగా.. వారిలో 11 శాతం మంది జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు తేలింది. ధూమపానం చేసేవారిలో ధూమపానం చేయని వారి కంటే జ్ఞాపక శక్తి కోల్పోయే ప్రమాదం దాదాపు 1.9 రెట్లు ఎక్కువ. గత పదేళ్లలో ధూమపానం మానేసిన వారి జ్ఞాపక శక్తి.. ధూమపానం చేయని వారి కంటే 1.5 రెట్లు ఎక్కువగా నమోదైంది. సర్వేకు ఒక దశాబ్దం కంటే ముందు ధూమపానం మానేసిన వారిలో ధూమపానం చేయని వారి కంటే కొంచెం ఎక్కువ ఎస్సీడీ ప్రాబల్యం ఉంది. అల్జీమర్స్, ఇతర రకాల నాడీ సంబంధిత పరిస్థితులకు ధూమపానాన్ని అనుసంధానించే ముందస్తు అధ్యయనాలకు ఈ ఫలితాలు మద్దతు ఇస్తాయని అధ్యయన రూపకర్త జెన్నా రాజ్‌జిక్ చెప్పారు.ధూమపానం మానేయడానికి ఈ అధ్యయనం అదనపు అనుభవంగా ఉపయోగపడుతుందని రాజ్‌జిక్ తెలిపారు. ధూమపానం మానేయడం వల్ల శ్వాసకోశ మరియు హృదయనాళ ఆరోగ్యానికి అదనంగా నరాల ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. మధ్య వయస్కులైన ధూమపానం చేసేవారిలో నరాల సంబంధిత నష్టం అత్యంత దారుణంగా ఉందని కూడా అధ్యయనం నిర్ధారించింది. ఈ అధ్యయనంలో.. ధూమపానం, జ్ఞాపకశక్తి కోల్పోవడం మధ్య సంబంధం 45-59 సంవత్సరాల మధ్య ప్రముఖంగా ఉందని వివరించారు. ఒక వ్యక్తి ఈ వయస్సులో ధూమపానం మానేయాలని నిర్ణయించుకుంటే వారు తమ అభిజ్ఞా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహనం కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.